లోక్ సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు కైవసమే లక్ష్యంగా బీజేపీ విజయ సంకల్ప యాత్రలకు కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 20వ తేదీ నుంచి 29వ తేదీ వరకు యాత్రలను నిర్వహించనుంది. ఐదు పార్లమెంట్ క్లస్టర్లలో విజయ సంకల్ప యాత్రలు చేపట్టాలని రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. ఈ యాత్రలకు క్లస్టర్ వారీగా బీజేపీ పేర్లు పెట్టింది.
భువనగిరి, మల్కాజ్ గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు భాగ్యనగరమని నామకరణం చేశారు. కరీంనగర్, మెదక్ , జహీరాబాద్, చేవెళ్ల పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు శాతవాహన అని, అదిలాబాద్, పెద్దపల్లి, నిజమాబాద్ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కొమురం భీమ్ అని పేరు పెట్టారు. మహబూబ్ నగర్, నాగర కర్నూల్, నల్గొండ పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కృష్ణా అని, వరంగల్, మహబూబ్ బాద్, ఖమ్మం పార్లమెంట్ పరిధిలో జరిగే యాత్రకు కాకతీయగా పేర్లు పెట్టినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మార్చి మొదటి వారంలో భారీ బహిరంగ సభ పెట్టాలని యోచిస్తున్నట్లు వెల్లడించాయి.