డిసెంబర్ 3వ తేదీన ఐదు రాష్ట్రాల (తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, మిజోరాం) అసెంబ్లీ స్థానాల కౌంటింగ్ జరగనుందని ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఈశాన్య రాష్ట్రం మిజోరం అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ను సీఈసీ ఒకరోజు వాయిదా వేసింది. డిసెంబర్ 3వ తేదీకి బదులు డిసెంబర్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు జరపనున్నట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. వివిధ వర్గాల నుంచి వచ్చిన అభ్యర్థనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు..
మిజోరం ప్రజలకు ఆదివారం ప్రత్యేకమైన రోజు అయినందున కౌంటింగ్ తేదీ మార్చాలని వివిధ వర్గాల నుంచి అభ్యర్థనలు వచ్చాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. వారి అభ్యర్థనలు పరిగణనలోకి తీసుకుని డిసెంబర్ 4వ తేదీకి కౌంటింగ్‌ను వాయిదా వేసినట్లు వెల్లడించింది. మిగతా నాలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియ యథావిథిగా జరుగుతుందని స్పష్టం చేసింది.
మొత్తం 40 అసెంబ్లీ స్థానాలు ఉన్న మిజోరం రాష్ట్రంలో ఒకే విడతలో నవంబర్ 7వ తేదీన ఎన్నికలు జరిగాయి. 11 జిల్లాల వ్యాప్తంగా 40 స్థానాల్లో ఆరోజు సాయంత్రం 5గంటల వరకు 77.04శాతం పోలింగ్ నమోదైంది. ఇక ఈ రాష్ట్రంలో మిజో నేషనల్ ఫ్రంట్ (MNF), కాంగ్రెస్, జోరం పీపుల్స్ మూమెంట్ (ZPM) మధ్యే ప్రధాన పోటీ నడుస్తోంది.