నేరాలకు అడ్డుకట్ట వేయడంలో యోగి ఆదిత్యనాథ్ స్టైలే వేరు. మొన్నటిదాక బుల్డోజర్ తో నేరగాళ్ల గుండెల్లో రైలు పరిగెట్టించిన యోగి.. ఇప్పుడు నేరాలు చేసినవారిని ఎన్ కౌంట్ చేస్తామంటూ భయానికి గురిచేస్తున్నారు. యోగి వార్నింగ్ సీరియస్ గా తీసుకున్న ఓ నేరస్థుడు స్వయంగా పోలీసుల ఎదుట లొంగిపోయాడు. అంతటితో ఆగకుండా తాను లొంగిపోతానని, జీవితంలో మరోసారి నేరాలకు పాల్పడనని, తనను ఎన్కౌంటర్ చేయొద్దని అట్టపైన రాసి మెడలో వేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లోని గాజియాబాద్‌లో జరిగింది.
గాజియాబాద్ లోని పోలీస్ స్టేషన్ పరిధిలో సెప్టెంబర్ 9న ఓ హత్య జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. అనంతరం ఇద్దరు నిందితులను అరెస్ట్ చేయగా.. మరొకరు పరారీలో ఉన్నాడు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం అవసరమైతే నిందితుడిని ఎన్కౌంటర్ చేస్తామని హెచ్చరించారు జిల్లా ఎస్పీ.
దీంతో హడలిపోయిన నిందితుడు సొహైల్.. తాను జీవితంలో మరోసారి నేరం చేయనని.. తనను ఎన్కౌంటర్ చేయవద్దని మెడలో బోర్డు తగిలించుకుని వచ్చి పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు.