స్వతంత్ర హోదాతో బీజేపీ ఇస్తామని చెప్పిన కేంద్ర సహాయ మంత్రి పదవిని ఎన్సీపీ తిరస్కరించింది. ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం సందర్భంగా దిల్లీలో ఆదివారం ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు ప్రఫుల్ పటేల్ మాట్లాడుతూ.. గతంలోనే తాను కేబినెట్ మంత్రిగా పనిచేశాననీ, ఇప్పుడు సహాయ మంత్రి అంటే తన స్థాయిని తగ్గించుకోవడమే అవుతుందని అభిప్రాయపడ్డారు. ఇప్పటికే ఈ విషయాన్ని బీజేపీ అధిష్ఠానం దృష్టికి తీసుకెళ్లగా.. కొద్దిరోజుల్లో తగిన చర్యలు తీసుకుంటామని వారు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు.
పటేల్ నిరుత్సాహానికి గురైనట్లు వార్తలు రావడంతో.. మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఫడణవీస్, కమలం నేత వినోద్ తావ్‌డే ఆయన్ను కలిశారు. అనంతరం ఫడణవీస్ మాట్లాడుతూ పొత్తు ధర్మం ప్రకారం మిత్ర పక్షాలకు పార్లమెంట్‌లో బలం ఆధారంగా మంత్రిత్వ శాఖల కేటాయింపు జరుగుతుందని తెలిపారు. భవిష్యత్తులో విస్తరణ జరిగినప్పుడు అవకాశం ఉంటుందనీ, అప్పటివరకు వేచిచూడాలని పటేల్‌ను అభ్యర్థించామని చెప్పారు. అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీకి లోక్‌సభలో ఒకరు, రాజ్యసభలో మరో సభ్యుడు ఉన్న విషయం తెలిసిందే.