నేటి ‘నీట్‌ పీజీ’ పరీక్ష వాయిదా

-

గత కొద్ది రోజులుగా నీట్‌ యూజీ, యూజీసీ నెట్‌ ప్రశ్నపత్రాల లీకేజీ వివాదం దేశవ్యాప్తంగా పెనుదుమారం రేపిన తెలిసిందే. ఈ వివాదాల నేపథ్యంలో ఈరోజు (జూన్ 23వ తేదీ 2024) జరగాల్సిన నీట్‌ పీజీ ప్రవేశ పరీక్షను కేంద్ర ప్రభుత్వం వాయిదా వేసింది. మరోవైపు నీట్‌ యూజీలో అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు కేంద్ర విద్యాశాఖ ఆదేశించింది. ఇందులో భాగంగా జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) డైరెక్టర్‌ జనరల్‌ సుబోధ్‌ సింగ్‌కు ఉద్వాసన పలికింది. సీబీఐ దర్యాప్తులో భాగంగా నీట్‌ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నామని శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. అతి త్వరలో పరీక్ష తేదీని ప్రకటిస్తామని తెలిపింది.

వాయిదావల్ల విద్యార్థులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నామని కేంద్రం పేర్కొంది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వెల్లడించింది. అయితే ఆదివారమే పరీక్ష కావడంతో దేశవ్యాప్తంగా విద్యార్థులు సుదూర ప్రాంతాల నుంచి నగరాలు, పట్టణాలకు చేరుకున్నారు. శనివారం రాత్రి పరీక్ష వాయిదాను కేంద్రం ప్రకటించడంతో వారంతా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. చేసేదేం లేక మళ్లీ ఇంటి బాట పట్టారు. ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారంలో దిద్దుబాటు చర్యలను కేంద్రం వేగవంతం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version