తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను ఈ ఏడాది ఘనంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. జులై 7వ తేదీ నుంచి 29వ తేదీ వరకు రంగరంగ వైభవంగా ఈ ఉత్సవాన్ని జరపనుంది. ఈ నేపథ్యంలోనే ఆషాఢ బోనాల ఉత్సవాల కోసం సీఎం రేవంత్‌రెడ్డి రూ.20 కోట్లు మంజూరు చేశారు. ఈ విషయాన్ని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ వెల్లడించారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఈ ఉత్సవాలను నిర్వహించాలని దేవాదాయ శాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి ఉత్సవ కమిటీని ఏర్పాటుచేశామని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఛైర్మన్‌గా, తనతోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎంపీ అనిల్‌కుమార్‌యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ సభ్యులుగా వ్యవహరిస్తారని, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి కన్వీనర్‌గా కొనసాగుతారని వెల్లడించారు. మరోవైపు దిల్లీలోని తెలంగాణ భవన్‌లో తెలంగాణ ఖ్యాతిని ఇనుమడించేలా ఉత్సవాలు నిర్వహించాలని అధికారులకు మంత్రి కొండా సురేఖ ఆదేశాలు జారీ చేశారు.