నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. ఈ భవనం ప్రారంభోత్సవానికి ముహూర్తం సిద్ధమైంది. పార్లమెంట్ భవనాన్ని మే చివర్లో ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్ర ప్రజా పనుల విభాగం (సీపీడబ్ల్యూడీ) వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.
ప్రారంభోత్సవం కోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. పుష్పాల అలంకరణ సహా ఇతర డెకరేషన్ పనుల కోసం రూ.14 లక్షలకు టెండర్లు పిలిచినట్లు వివరించాయి. ప్రారంభోత్సవానికి సంబంధించి అధికారిక తేదీని త్వరలోనే ప్రకటించనున్నట్లు స్పష్టం చేశాయి.
“పార్లమెంట్ కొత్త భవనం నిర్మాణం దాదాపు పూర్తైంది. నిర్మాణ అనంతర పరిశీలన పెండింగ్లో ఉంది. కేంద్ర గృహ, పట్టణ శాఖ కార్యదర్శి మనోజ్ జోషి, సీపీడబ్ల్యూడీ డీజీ శైలేంద్ర శర్మ పనుల పురోగతిని పరిశీలిస్తున్నారు. అలంకరణ బిడ్డింగ్ గెలుచుకున్న వారు.. తేదీ ప్రకటించిన మూడు రోజుల్లోగా ఏర్పాట్లు పూర్తి చేయాలి. నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభిస్తారు. ఇతర ప్రముఖులు సైతం ఈ కార్యక్రమానికి హాజరవుతారు” అని అధికార వర్గాలు వెల్లడించాయి.