ఖలిస్థానీ ఉగ్రవాది నిజ్జర్ హత్యతో కెనడా-భారత్‌ల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఖలిస్థానీలు దేశానికి ముప్పని భావిస్తున్న భారత్.. వారిపై కొరఢా ఝళిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులను రంగంలోకి దింపింది కేంద్ర సర్కార్. ఎన్ఐఏ అధికారులు ఖలిస్థానీ ముఠాలపై.. వారి అనుచరులపై ఉక్కుపాదం మోపుతున్నారు.
కెనడాలోని ఖలిస్థానీ సంస్థకు మద్దతిస్తున్న భారతీయ ముఠాలను ఎన్ఐఏ ఏరిపారేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆరు రాష్ట్రాల్లో తనిఖీలు చేపడుతోంది. ఆరు రాష్ట్రాల్లో ఖలిస్థాన్ గ్యాంగ్‌స్టర్లు, వారి అనుచరులను లక్ష్యంగా చేసుకుని సోదాలు చేస్తోంది. ఇవాళ తెల్లవారుజామున నుంచే ఎన్ఐఏ బృందాలు ఆరు రాష్ట్రాల్లోని 51 ప్రాంతాల్లో స్థానిక పోలీసుల సహకారంతో దాడులకు దిగాయి.
లారెన్స్, బాంబిహా, అర్ష డాలా ముఠాలను ఎన్ఐఏ లక్ష్యంగా చేసుకుంది. గ్యాంగ్‌స్టర్లు… లారెన్స్ బిష్ణోయ్, జస్‌దీప్ సింగ్, కాలా జతేరి అలియాస్ సందీప్, వీరేందర్ ప్రతాప్ అలియాస్ కాలా రాణా, జోగిందర్ సింగ్‌ల చిత్రాలను.. ఇటీవల ఎన్ఐఏ ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులో పేర్కొన్న వారి పేరుతోగానీ, వారి అనుచరుల పేరిటగానీ ఉన్న ఆస్తులు, వ్యాపారాలు, వారి వ్యాపార భాగస్వామ్యులు, వారి కోసం పనిచేసే ఉద్యోగులు, కలెక్షన్ ఏజెంట్ల వివరాలను తమకు తెలపాలని ఎన్ఐఏ కోరింది.