దేశంలో కోవిడ్ మూడో వేవ్ వస్తుందని నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్న నేపథ్యంలో స్కూళ్లను, కాలేజీలను ఇప్పటికీ ఇంకా తెరవడం లేదు. పిల్లల ఆరోగ్యం పట్ల తల్లిదండ్రులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే విషయంపై ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) కీలక ప్రకటన చేసింది. ప్రైమరీ స్కూళ్లను ముందుగా ఓపెన్ చేయాలని, వారిపై కోవిడ్ ఇన్‌ఫెక్షన్ ప్రభావం అంతగా ఉండదని పేర్కొంది.
స్కూళ్లను ఓపెన్ చేసే క్రమంలో ఉపాధ్యాయులు, సిబ్బంది అందరికీ కచ్చితంగా రెండు డోసుల వ్యాక్సిన్‌ను వేయాలని ఐసీఎంఆర్ సూచించింది. పెద్దల కన్నా పిల్లలు వైరల్ ఇన్‌ఫెక్షన్లను బాగా తట్టుకుంటారని, కనుక ముందుగా ప్రైమరీ స్కూళ్లను ఓపెన్ చేయాలని సూచించింది. యాంటీ బాడీలు పెద్దలు, పిల్లల్లో ఒకే రకంగా ఉంటున్నాయని స్పష్టం చేసింది.
స్కాండినేవియాలో కొన్ని ప్రైమరీ స్కూళ్లను తెరిచే ఉంచారనే విషయాన్ని ఈ సందర్బంగా ఐసీఎంఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ బలరామ్ భార్గవ వెల్లడించారు. పిల్లల్లో కోవిడ్ ఇన్‌ఫెక్షన్ తీవ్రతరం అయిన కేసులు దాదాపుగా లేవన్నారు. దేశంలో ఇప్పటి వరకు నిర్వహించిన సీరో సర్వేలో మూడింట రెండు వంతుల మందిలోనే యాంటీ బాడీలు ఉన్నట్లు ఫలితాలు వచ్చాయని, 40 కోట్ల మందికి ఇన్‌ఫెక్షన్ సోకే ప్రమాదం ఉందని అన్నారు. అయితే ప్రైమరీ స్కూళ్లను తెరిస్తే మంచిదేనని ఆయన అభిప్రాయపడ్డారు.