ఇజ్రాయెల్-హమాస్‌ల మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఈ యుద్ధంలో వేల మంది పౌరులు మరణిస్తున్నారు. లక్షల మంది క్షతగాత్రులవుతున్నారు. చిన్నపిల్లలు, మహిళలపై హమాస్ ముష్కరులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. చేతులకు సంకెళ్లు వేసి తలలు నరుకుతున్నారు. అడ్డొచ్చిన వాళ్లను అక్కడిక్కకడే కాల్చి చంపుతున్నారు. ఈ భీతావహ సమయంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తరలించడానికి కేంద్రం ‘ఆపరేషన్ అజయ్’ చేపట్టింది.
ఇందులో భాగంగా 212 మందితో కూడిన తొలి విమానం ఇవాళ తెల్లవారుజామున దిల్లీకి చేరింది. వీరికి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్వాగతం పలికారు. గురువారం టెల్ అవీవ్‌కు చేరుకున్న చార్టర్డ్ విమానం.. అక్కడి నుంచి అదే రోజు సాయంత్రం బయలు దేరి ఇవాళ దిల్లీ చేరుకుంది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య నెలకొన్న భీకర యుద్ధంలో ప్రాణాలతో ఉంటామో లేదోనని భయంతో గడిపిన భారతీయులు స్వదేశానికి తరలిరావడంతో ఊపిరి పీల్చుకున్నారు. తమనుతమను సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చిన భారత ప్రభుత్వానికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు. ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో భారతీయులు ఉన్నా.. కేంద్ర సర్కార్ వాళ్లను వదిలిపెట్టదని.. సురక్షితంగా భరతభూమికి తీసుకువస్తుందని కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు.