కేంద్ర సర్కార్ లోక్ సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. అయితే ఈ బిల్లుపై విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ బిల్లు ‘ఎన్నికల జుమ్లా’ అంటూ కాంగ్రెస్ విమర్శిస్తూ.. మహిళల ఆశలకు ‘భారీ ద్రోహం’ అని విమర్శించింది. మరోవైపు ఇది మహిళలను ఫూల్ చేసే బిల్లు అని ఆప్ నేతలు ధ్వజమెత్తారు.
మహిళా రిజర్వేషన్ బిల్లులో డీలిమిటేషన్, జనాభా లెక్కల నిబంధనలను ఎందుకు చేర్చారని విపక్ష నేతలు ప్రశ్నించారు. దీని ద్వారా 2024 ఎన్నికల ముందు ఈ రిజర్వేషన్ అమలులోకి రాదని అర్థమవుతుందని.. ఇప్పుడున్న డీలిమిటేషన్, జనాభా గణన నిబంధనలు అనుసరించి 2024 ఎన్నికల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియ అయిపోయిన తర్వాతే అమలులోకి వస్తుందని బిల్లులో పేర్కోవడంపై మండిపడ్డారు.
2024 ఎన్నికల లోపు డీలిమిటేషన్ జరుగుతుందా? అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మోదీ సర్కార్ 2021 జనగణను ఇంకా నిర్వహించలేదని.. ఇక ఎన్నికల సీజన్లో జుమ్లాల కంటే ఇది పెద్దది అని ఎద్దేవా చేశారు. జీ20 దేశాల్లో జన గణన చేయడంలో విఫలమైన దేశం భారత్ మాత్రమే అని అన్నారు.