బిహార్ రాజకీయాల్లో పప్పూ యాదవ్ పేరు తెలియని వారుండరు. పలుమార్లు లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన.. తాజాగా స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశారు. అనంతరం తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తనకు టికెట్ దక్కలేదని ఏడ్చేశారు.
మాజీ ఎంపీ రాజేశ్ రంజన్ అలియాస్ పప్పూయాదవ్ .. పూర్నియా నియోజకవర్గం నుంచి ఎంపీ టికెట్ ఆశించి భంగపడ్డారు. ఆర్జేడీ-కాంగ్రెస్ పొత్తులో భాగంగా లాలూ ప్రసాద్ యాదవ్ పార్టీ పూర్నియా నుంచి భీమా భారతిని నిలబెట్టడంతో పప్పూ తీవ్రంగా బాధపడ్డారు. దాంతో ఆ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన అనంతరం తన మద్దతుదారులతో మాట్లాడుతూ కన్నీరు పెట్టుకున్నారు. తనకు పదేపదే ఎందుకు టికెట్ నిరాకరిస్తున్నారని, తనకేం తక్కువ అంటూ వెక్కి వెక్కి ఏడ్చారు.
తేజస్వి వెంటరాగా.. పూర్నియా స్థానానికి భీమా భారతి నామినేషన్ వేయడంపై పప్పూ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను నామినేషన్లు వేసేప్పుడు అభ్యర్థి వెంట ఎన్నడూ వెళ్లలేదని, కానీ తనకు వ్యతిరేకంగా పోటీ చేస్తోన్న అభ్యర్థి కోసం ఈసారి వచ్చారని మండిపడ్డారు. గత ఏడాది కాలంగా పూర్నియా కోసం పనిచేస్తున్న తనకు దక్కింది ఇది అని అసంతృప్తి వ్యక్తం చేశారు.