డిసెంబర్ 4 నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు

-

ఈ ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్‌ 4వ తేదీ నుంచి షురూ కానున్నాయి. ఈ మేరకు పార్లమెంటు వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషి ఓ ప్రకటన జారీ చేశారు. డిసెంబర్‌ 22వ తేదీ వరకు ఈ సమావేశాలు కొనసాగుతాయని ఆయన తెలిపారు. అలాగే ఈ సమావేశాల్లో పలు కీలక బిల్లులను ప్రవేశపెడతామని జోషీ వెల్లడించారు.

ఐపీసీ, సీఆర్‌పీసీ, ఎవిడెన్స్ చట్టాల స్థానంలో తీసుకొచ్చే భారతీయ న్యాయ సంహిత, భారతీయ సాక్ష్యా సంహిత, భారతీయ నాగరిక్‌ సురక్షా సంహిత బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ బిల్లులపై పార్లమెంటు స్థాయిసంఘం చర్చించి స్పీకర్‌కు నివేదిక ఇచ్చిన విషయం తెలిసిందే. వీటితో పాటు ముగ్గురు ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లును ప్రవేశపెట్టే యోచనలో కేంద్రం ఉన్నట్లు సమాచారం. పార్లమెంటులో ప్రశ్నలు అడిగేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా డబ్బు తీసుకున్నారన్న వ్యవహారం కూడా చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్‌ 3న 5 రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉండటంతో .. డిసెంబర్‌ 2నే అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నట్లు ప్రహ్లాద్‌ జోషి వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version