నేటి నుంచి అందుబాటులోకి పీఎం కిసాన్‌ సేవా కేంద్రాలు

-

దేశవ్యాప్తంగా నేటి నుంచి ప్రధాని కిసాన్‌ సేవా కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. వ్యవసాయరంగానికి సంబంధించి అన్ని రకాల సేవలు ఒకేచోట లభ్యమయ్యేలా ఈ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. దేశంలోని ఎరువుల దుకాణాలన్నింటినీ కిసాన్‌ సేవా కేంద్రాలుగా మారుస్తున్నట్లు వెల్లడించారు. దేశవ్యాప్తంగా మొత్తం 2.80 లక్షల కేంద్రాలు ఏర్పాటు కానుండగా.. తొలిదశలో ఇవాళ 1.25 లక్షల కేంద్రాలు ప్రారంభమవుతాయని చెప్పారు.

వీటిలో తెలంగాణలో నాలుగువేల కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. ఈ కేంద్రాల్లో ఎరువులతో పాటు, నాణ్యమైన విత్తనాలు, పురుగుమందులు, వ్యవసాయ పరికరాలు, సాగుకు అవసరమైన సలహాలు, బీమా తోడ్పాటు, విత్తనాల నాణ్యత, నీటి నాణ్యత, భూసారపరీక్షలు సహా అన్ని సేవలు లభ్యమవుతాయని చెప్పారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులపై అవగాహన కలిగిస్తారని, జిల్లా స్థాయి డీలర్ల వద్ద పురుగుమందులు పిచికారీ చేసే డ్రోన్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. వాట్సాప్‌ గ్రూపుద్వారా రైతులకు వాతావరణ సూచనలు, మార్కెట్లలో ధరల సమాచారం అందుతుందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version