భారతప్రధానిగా నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో మోదీ 3.0 కేబినెట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాలకు 5 నుంచి 8 కేబినెట్ బెర్త్‌లు దక్కే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ కీలక నేతలు అమిత్ షా, జేపీ నడ్డా, రాజ్‌నాథ్ సింగ్ మిత్రపక్షాల నేతలు చంద్రబాబు, నీతీశ్ కుమార్, ఏక్‌నాథ్ శిందేతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు.
అయితే కీలకమైన హోంశాఖ, ఆర్థిక శాఖ, రక్షణశాఖ, విదేశాంగ శాఖతో పాటు విద్య, సాంస్కృతిక మంత్రిత్వ శాఖలు బీజేపీ వద్దే ఉంటాయని పార్టీ వర్గాల సమాచారం. అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ మరోసారి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కించుకోవడం ఖాయమని పార్టీ వర్గాలు తెలిపాయి. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన మాజీ సీఎంలు శివరాజ్‌సింగ్ చౌహాన్, బసవరాజ్ బొమ్మై, మనోహర్‌లాల్ ఖట్టర్, సర్బానంద సోనోవాల్ మంత్రిపదవులు దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తెలుగుదేశం ఎంపీ రామ్మోహన్ నాయుడు, జేడీయూ నుంచి లలన్ సింగ్ లేదా సంజయ్ ఝా, రామ్‌నాథ్ ఠాకూర్, లోక్‌జనశక్తి రాం విలాస్ పాసవాన్ పార్టీకి చెందిన చిరాగ్ పాసవాన్ మంత్రివర్గంలో చోటు దక్కించుకోనున్నట్లు సమాచారం.