ప్రకృతి విపత్తుతో అల్లాడుతున్న మయన్మార్ కు ప్రపంచ దేశాలు అండగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆ దేశంలో భూకంపం విపత్తుపై ప్రధాని మోదీ స్పందించారు. తాజాగా ఆయన మయన్మార్ లోని ప్రస్తుత పరిస్థితులు తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే మయన్మార్ అధికారులకు ఫోన్ కాల్ చేశారు. భూకంప పరిస్థితులు, సహాయక చర్యలపై అధికారులను ఆరా తీశారు.
మిలిటరీ సీనియర్ జనరల్ మిన్ ఆంగ్ హలాయింగ్‌తో మాట్లాడి ప్రధాని మోదీ వివరాలు తెలుసుకున్నారు. భారత్ నుంచి సహాయ సహకారాలు అందిస్తామని మరోసారి భరోసా కల్పించారు. ఇప్పటికే ఆ దేశానికి ఆపరేషన్ బ్రహ్మ పేరుతో సహాయక సామగ్రి, సహాయక సిబ్బందిని ఇండియా పంపిన విషయం తెలిసిందే. మరింత సాయం చేసేందుకు రెడీగా ఉన్నామని మయన్మార్ అధికారులకు ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు. ఇక ఇప్పటికే భూకంపం సంభవించిన ఘటనలో మయన్మార్ లో వెయ్యికి పైగా మంది మరణించిన విషయం తెలిసిందే. మరోవైపు థాయ్ లాండ్ లోనూ భూకంపం విలయం సృష్టించింది.