భారత్లో వచ్చే ఏడాది తాను మూడోసారి ప్రధాన మంత్రి పదవి చేపడతానని నరేంద్ర మోదీ అన్నారు. ఆ ఐదేళ్ల కాలంలో భారత్ను ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చి తీరతానని హామీ ఇచ్చారు. ఆదివారం రోజున సూరత్లోని ఖజోడ్ గ్రామంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన సూరత్ డైమండ్ బోర్స్ను ప్రధాని మోదీ ప్రారంభించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. గత పదేళ్లలో ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక వ్యవస్థల జాబితాలో భారత్ పదో స్థానం నుంచి ఐదుకు ఎగబాకిందని చెప్పారు. తాను మూడోసారి ప్రధానమంత్రి పదవిని చేపట్టాక ఆ ఐదేళ్ల కాలంలో ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత ఆర్థిక వ్యవస్థ అవతరిస్తుందని హామీ ఇచ్చారు. దిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌వే ప్రాజెక్టు సూరత్ వాణిజ్యానికి సరికొత్త అవకాశాలను సృష్టిస్తుందని తెలిపారు.
ఇక సూరత్ వైభవంలో మరో వజ్రం చేరిందని.. ఇది ప్రపంచంలోనే అత్యుత్తమమైనదని మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద భవంతులు సైతం ఈ వజ్రం మెరుపుల ముందు వెలవెలబోతాయని చెప్పారు. ఈ వజ్రాల బోర్స్ గురించి ఎవరు మాట్లాడినా.. భారత్‌ను, సూరత్‌ను ప్రస్తావిస్తారని మోదీ అన్నారు.