అధికారాన్ని కోరుకునేవారు వారి సొంత కుటుంబాల వృద్ధిపైనే దృష్టి పెడతారు. కానీ మా సర్కార్ మాత్రం సమ్మిళిత అభివృద్ది కోసమే పని చేస్తోంది. అని విపక్షాలను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని తన సొంత నియోజకవర్గం వారణాసిలో ఆయన పర్యటించారు. అక్కడ రూ.3,880కోట్ల విలువైన 44 గ్రామీణాభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు.
దేశానికి సేవ చేయడంలో తమ సర్కార్ సబ్‌కా సాత్ సబ్‌కా వికాస్ మంత్రంతో ముందుకు సాగుతోందని మోదీ అన్నారు. అధికారం దాహం కోసం ఆరాటపడే వారు రాత్రి, పగలు రాజకీయ ఆటలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రతిపక్షాలు పరివార్ కా సాథ్ పరివార్ కా వికాస్ అనే మంత్రంతోనే వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. తమ సర్కార్ తీసుకువచ్చిన ఆయుష్మాన్ భారత్‌తో పేదలు అప్పులు చేయకుండా మెరుగైన వైద్యం లభిస్తోందని వెల్లడించారు.
యువతకు క్రీడా రంగంలో వృద్ధి అవకాశాలను ఎన్డీఏ సర్కార్ నిరంతరం కృషి చేస్తోందని ప్రధాని మోదీ వివరించారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వడానికి చాలా ప్రయత్నిస్తున్నామని చెప్పిన ఆయన.. ఒలింపిక్స్‌లో భారత్ మెరవాలంటే, యువత ఇప్పటి నుంచే శిక్షణ ప్రారంభించాలని చెప్పారు.