శ్రీరామనవమి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తమిళనాడులో పర్యటించనున్నారు. ఆ రాష్ట్రంలోని రామేశ్వరంలో రామనాథస్వామి ఆలయాన్ని సందర్శించనున్నారు. ఏప్రిల్ 6వ తేదీన రామేశ్వర ఆలయంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కొత్త ‘పంబన్ బ్రిడ్జ్’ని ప్రారంభిస్తారు. ఈ వంతెన తమిళనాడు ప్రధాన భూభాగాన్ని రామేశ్వరం ద్వీపంతో అనుసంధానిస్తుంది. సముద్రంలో ఉన్న పాత వంతెన తుప్పు పట్టడంతో 2022లో మూసేశారు. ఈ వంతెన స్థానంలోనే కొత్త వంతెన రానుంది.
హిందీ వివాదం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ(ఎన్‌ఈపీ)పై ఇటీవల కేంద్రం, తమిళనాడులోని డీఎంకే ప్రభుత్వాల మధ్య తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ నేపథ్యంలో మోదీ తమిళనాడు పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. హిందీని తమపై రుద్దేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రయత్నిస్తోందని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఆరోపించిన విషయం తెలిసిందే. అంతేకాకుండాడీలిమిటేషన్ని వ్యతిరేకిస్తూ చెన్నైలో స్టాలిన్ నేతృత్వంలో భేటీ కూడా జరిగింది. ఈ వివాదల నేపథ్యంలో మోదీ పర్యటించడం ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. అయితే ఇది కేవలం ఆధ్యాత్మిక పర్యటన మాత్రమేనని దీన్ని రాజకీయ కోణంలో చూడొద్దని బీజేపీ నేతలు అంటున్నారు.