దిల్లీ చలో నిరసన కార్యక్రమంలో భాగంగా హస్తినలో ఉన్న రైతులపై పోలీసులు మరోసారి టియర్ గ్యాస్ ప్రయోగించారు. రెండో రోజు శంభు సరిహద్దులో ఈ ఘటన జరిగినట్లు రైతులు తెలిపారు. హరియాణా పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారని పేర్కొన్నారు. రైతుల నిరసనల నేపథ్యంలో దిల్లీ పోలీసులు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.
హర్యానా నుంచి నగరంలోకి ప్రవేశించే మార్గంలో పెద్ద ఎత్తున సిమెంట్ బారికేడ్లను ఏర్పాటు చేశారు. కొన్ని మార్గాల్లో వాహన రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. రైతులను అడ్డుకునేందుకు కాంక్రీటు దిమ్మెలు, ఇనుప కంచెలు, మేకులు, కంటైనర్ల గోడలతో బహుళ అంచెల్లో బారికేడ్లను పెట్టారు. రహదారుల దిగ్బంధంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనేక చోట్ల కిలోమీటర్ల పొడవున వాహనాలు నిలిచాయి.
మరోవైపు నిరసనకారులపై బాష్పవాయువు ప్రయోగించేందుకు వాడే డ్రోన్లు పంజాబ్ భూభాగంలోకి రావడంపై ఆ రాష్ట్ర అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. శంభు సరిహద్దుల్లో డ్రోన్లు తమ భూభాగంలోకి రావొద్దని చెబుతూ పటియాలా డిప్యూటీ కమిషనర్ షౌకత్ అహ్మద్ అంబాలా డీసీకి లేఖ రాశారు.