కొన్నేళ్ల నుంచి వాయిదా పడుతూ వస్తున్న జనగణన ఎట్టకేలకు మొదలు కానున్నట్లు సమాచారం. లోక్సభ ఎన్నికల తర్వాత దేశవ్యాప్తంగా జనగణన చేపట్టనున్నట్లు తెలుస్తోంది. విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం అందినట్లు బ్లూమ్‌బర్గ్ మీడియా వెల్లడించింది. జనాభా లెక్కల కోసం దాదాపు 3లక్షల మంది ప్రభుత్వ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపింది. 12 నెలలపాటు ఈ ప్రక్రియ కొనసాగనున్నట్లు వెల్లడించింది.
దేశంలో తొలిసారి 1881లో జనగణన నిర్వహించగా.. అప్పటినుంచి ప్రతి పదేళ్లకోసారి దశాబ్దం ప్రారంభంలో నిర్వహించటం ఆనవాయితీగా వస్తోంది. రెండు ప్రపంచ యుద్ధాలు, చైనా, పాకిస్థాన్లతో యుద్ధాలు జరిగిన సమయంలోనూ దేశంలో జనాభా లెక్కల సేకరణ ఆగలేదు. 2011లో చివరిసారి జనగణన నిర్వహించారు. 2021లో మళ్లీ చేపట్టాల్సిన జనాభా లెక్కలు, కరోనా వల్ల వాయిదా పడ్డాయి. ఈ క్రమంలోనే లోక్‌సభ ఎన్నికల తర్వాత జనగణన చేపట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఇటీవల తాత్కాలిక బడ్జెట్లోనూ ఈ కార్యక్రమానికి కేటాయింపులు చేశారు. ఈసారి కులాల ఆధారంగా జనాభాను లెక్కించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ప్రస్తుతం మన దేశ జనాభా 140 కోట్లకు పైమాటే.