అత్యాచారం, వేధింపుల కేసులకు సంబంధించి సస్పెండ్ అయిన జనతాదళ్ (సెక్యులర్) నేత, హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను కర్ణాటక కోర్టు జూన్ 24 వరకు జ్యుడిషియల్ కస్టడీకి పంపింది. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కస్టడీ సోమవారంతో ముగిసిన నేపథ్యంలో ఆయనను 42వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ (ఏసీఎంఎం) కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసును విచారిస్తున్న సిట్ సోమవారం ఉదయం స్పాట్ విచారణను పూర్తి చేయడంతో తదుపరి కస్టడీని కోరలేదు. మరోవైపు ఈ కేసు వ్యవహారంలో ఆధారాల సేకరణపై సిట్ ప్రత్యేక దృష్టి సారించింది.
అందులో భాగంగానే శనివారం హోలో నర్సిపూర్లోని ప్రజ్వల్ ఇంట్లో సిట్ అధికారులు పలు ఆధారాలు సేకరించారు. సొంత ఊరికి ప్రజ్వల్ను తీసుకువెళ్లిన నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. మీడియాను సైతం అనుమతించలేదు. సెక్స్ టేపుల కేసు వెలుగులోకి రావడంతో ప్రజ్వల్ రేవణ్ణ ఏప్రిల్లో దేశం విడిచి జర్మనీకి పారిపోయిన సంగతి తెలిసిందే. అంతర్జాతీయంగా అనేక ఇమ్మిగ్రేషన్ లో పాయింట్ల వద్ద అతనిపై పలు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలోనే మే 31న బెంగళూరుకు తిరిగి వచ్చిన అతన్ని సిట్ బృందం అరెస్ట్ చేసింది.