ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ మరో వివాదంలో చిక్కుకున్నారు. ఇటీవలే చంద్రయాన్-3పై వ్యంగ్యంగా ట్వీట్ చేసినందుకు ఆయనపై కేసు నమోదైంది. ఇప్పుడు తాజాగా మరో వివాదం ఆయణ్ను చుట్టుముట్టింది. తమిళనాడులోని ప్రముఖ పర్యాటక ప్రాంతం కొడైకెనాల్లో నటులు ప్రకాశ్ రాజ్, బాబీ సింహా.. అనధికారంగా నిర్మాణాలు చేపట్టారని పలువురు రైతులు ఆరోపించారు. ఆ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఆరోపణలపై స్పందించిన రెవెన్యూ అధికారులు.. సమగ్ర సర్వే చేపడతామని హామీ ఇచ్చారు.
కొడైకెనాల్ జిల్లా రెవెన్యూ అధికారి కార్యాలయంలో మంగళవారం.. రైతు సమస్యల పరిష్కార సమావేశం జరిగింది. రెవెన్యూ, అటవీ, ఉద్యానవన, రవాణా, పోలీసు శాఖలతోపాటు వివిధ శాఖల అధికారులు ఈ సమావేశానికి హాజరయ్యారు. విల్‌పట్టి పంచాయతీ పరిధిలో ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించి మూడంతస్తుల భవనాన్ని నటుడు బాబీ సింహా నిర్మించారని సామాజిక కార్యకర్త, రైతు మహేంద్రన్ ఆరోపించారు. కొండ గ్రామాల రైతులు.. రాకపోకలకు ఉపయోగించే రోడ్డుపై బాబీ సింహా ఆ భవనాన్ని నిర్మించారని ఆరోపణలు చేశారు. నటుడు ప్రకాశ్ రాజ్ కూడా సరైన అనుమతులు లేకుండా భవన నిర్మాణాలు చేపట్టారని ఆయన ఆరోపించారు.