బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితా ప్రకటన రాష్ట్రంలో చిన్నపాటి ప్రకంపనలు సృష్టించింది. టికెట్ రాని ఆశావహులంతా తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు ఖమ్మం జిల్లా పాలేరు టికెట్ కేటాయించకపోవడంపై బీఆర్ఎస్లో కొందరు నాయకులు అసమ్మతి గళం వినిపిస్తున్నారు.
పాలేరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల బీఆర్ఎస్ నాయకులు, తుమ్మల అనుచరులు ఖమ్మం గ్రామీణ మండలం సత్యనారాయణపురంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో సమావేశమై, భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఇంతకాలం పార్టీని నమ్ముకొని ఉన్న సీనియర్ నేత తుమ్మలకు టికెట్ దక్కకపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
తుమ్మల ఏ నిర్ణయం తీసుకున్నా.. దానికి కట్టుబడి ఉన్నామని కార్యకర్తలు తెలిపారు. ఆయన బీఆర్ఎస్లో కొనసాగితే రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందనే అభిప్రాయాన్ని అత్యధిక మంది వ్యక్తపరిచినట్లు సమాచారం. తుమ్మల ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని వారంతా ఏకగ్రీవంగా తీర్మానించారని తెలిసింది.