శబరిమల అరవణ ప్రసాదం అంటే ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. ఈ ప్రసాదం కేవలం శబరిమలలో మాత్రమే లభ్యం అవుతుంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఈసారి శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల సంఖ్య భారీగా తగ్గిందన్నది వాస్తవం. ఎవరైనా శబరిమల వెళ్తున్నారంటే ప్రసాదం తీసుకురమ్మని చెప్పేవారిని చూస్తుంటాం. శబరిమలలో దొరికే అరవణ పాయసానికి ఎంతో విశిష్టత ఉంది.
ఈ సీజన్‌లో మాత్రమే దొరికే ఈ ప్రసాదానికి డిమాండ్ ఎక్కువ. శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులు ఒక్కొక్కరు నాలుగైదు డబ్బాల ప్రసాదాన్ని తీసుకెళ్తారు. తమ బంధువులు, స్నేహితులకు ఆ ప్రసాదాన్ని పంచి అయ్యప్ప ఆశీర్వాదాన్ని అందిస్తుంటారు. శబరిమల యాత్రకు వెళ్లిన వ్యక్తులు తప్పనిసరిగా ఈ ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటారు.శబరిమల యాత్ర నుంచి వచ్చే సమయంలో ఈ ప్రసాదాన్ని ఎక్కువగా తీసుకొని వస్తుంటారు.
అయితే, ఇప్పుడు కరోనా సమయం కావడంతో గతంలో మాదిరిగా కాకుండా రోజుకు వెయ్యి మందిని మాత్రమే అనుమతిస్తున్నారు. వారాంతాల్లో 2000 మందికి మాత్రమే అవకాశం ఉన్నది. కరోనా భయంతో చాలామంది శబరిమల యాత్రను రద్దు చేసుకున్నారు. దీంతో అరవణ ప్రసాదం అందరికి దొరక్కపోవచ్చు. దీంతో శబరిమల ఆలయం ట్రస్ట్ ట్రావెన్ కోర్ ఓ నిర్ణయం తీసుకుంది. పోస్టల్ డిపార్ట్మెంట్ తో ఒప్పందం చేసుకుంది.
ఇక శబరిమల ప్రసాదాన్ని నేరుగా కావాల్సిన వారి ఇంటికి డెలివరీ చేసే విధంగా ఏర్పాట్లు చేసింది. శబరిమల ప్రసాదం కిట్ వీలుగా రూ.450 గా నిర్ణయించారు. దగ్గరలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి శబరిమల ప్రసాదం పేరిట ఉన్న ఫామ్ పూర్తి చేసి డబ్బు చెల్లిస్తే వారం రోజుల్లో మీ ఇంటికి ప్రసాదం కిట్ వస్తుంది. ఒక్కో ప్రసాదం కిట్ లో అరవణ ప్రసాదం, పసుపు, కుంకుమ, నెయ్యి, విభూతి, అష్టోత్తర అర్చన ప్రసాదం ఉంటాయి. ఒక రిసీట్ పై 10 వరకు ప్రసాదం కిట్ లు పొందవచ్చు. అంతకు మించి ప్రసాదం పొందాలి అంటే మరో రిసీట్ తీసుకోవాలి.