రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అయోధ్య రామమందిరాన్ని సందర్శించారు. బుధవారం అయోధ్యకు చేరుకున్న ఆమె బాలక్రామ్ గర్భగుడిలోకి వెళ్లి రాముడికి హారతిని ఇచ్చారు. రామయ్యకు ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు అందుకున్నారు. అనంతరం దేవాలయ ప్రతినిధులు ఆమెకు రామాలయ ప్రతిమను కానుకగా ఇచ్చారు. దీనికి సంబంధించిన ఫొటోలను ఆమె ఎక్స్లో షేర్ చేశారు.
రామమందిరాన్ని నిర్మించాక రాష్ట్రపతి తొలిసారిగా దర్శించుకున్నారు. బుధవారం ఉదయం అయోధ్యలోని మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాష్ట్రపతి ముర్ముకు గవర్నర్ ఆనందీ బెన్ పటేల్ ఘన స్వాగతం పలికారు. అనంతంర రామయ్యను సందర్శించుకుని సాయంత్రం సరయూ నదికి హారతి ఇచ్చి ముర్ము పూజలు చేశారు. ఆ తర్వాత హనుమాన్ గఢీ ఆలయాన్ని సందర్శించారు.
జనవరి 22న అయోధ్యలో రాముడు కొలువుదీరిన విషయం తెలిసిందే. బాల రాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ముఖ్య యాజమాన్‌గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యవహరించారు. మోదీ సమక్షంలో ఆలయంలో తొలుత ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహం వద్ద ప్రధాని మోదీ ప్రాణ ప్రతిష్ట క్రతువును చేపట్టారు.