నాపై ఎన్ని కేసులైనా పెట్టుకోండి. కేసులను బెదిరిపోయే వ్యక్తిని కాదు నేను. మరిన్ని ఎఫ్ఐఆర్లు నమోదు చేయండి. అని అసోం పోలీసులకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సవాల్ విసిరారు. తనతో సహా మరికొంత మంది హస్తం నేతలపై అసోం పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ విషయంతో పాటు అసోం సీఎం హిమంత బిశ్వశర్మపై రాహుల్ గాంధీ తీవ్రంగా ధ్వజమెత్తారు.
బార్పేటలో భారత్ జోడో న్యాయ్ యాత్రలో భాగంగా రాహుల్ మాట్లాడుతూ.. దేశంలోని అత్యంత అవినీతి ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అని ఆరోపించారు. అసోంలో ఆయన భయం, ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నారని, ప్రజల దృష్టి మరల్చి వారి భూములు, డబ్బును దోచుకుంటున్నారని విమర్శించారు. కేసులతో తనను భయపెట్టగలనన్న ఆలోచన హిమంతకు ఎలా వచ్చిందోనని ఎద్దేవా చేశారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ తనను బెదిరించలేవన్న రాహుల్.. అవి అసోం భాష, సంస్కృతి, చరిత్రను తుడిచిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, అసోం సీఎం హిమంత బిశ్వ శర్మల హృదయాలు ద్వేషంతో నిండిపోయాయని రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు.