“పార్లమెంటు సమావేశాలు అప్రజాస్వామికంగా నడుస్తున్నాయి. లోక్‌సభలో మాట్లాడేందుకు నాకు కనీసం అవకాశం కూడా ఇవ్వడం లేదు. నాకు ప్రసంగించే అవకాశం ఇవ్వకుండానే సభ వాయిదా వేశారు.” అని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. సభ గౌరవాన్ని కాపాడేందుకు సభ్యులు విధివిధానాలు పాటించాలని స్పీకర్ ఓం బిర్లా కోరిన తర్వాత రాహల్ ఈ విధంగా వ్యాఖ్యానించారు. గతవారం కూడా తనను మాట్లాడనివ్వలేదని రాహుల్ ఆక్షేపించారు.
బుధవారం లోక్‌సభ వాయిదా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడిన రాహుల్ గాంధీ.. సభా కార్యకలాపాలు సజావుగా సాగేందుకు మాత్రం ఇది సరైన మార్గం కాదని అన్నారు. ప్రతిపక్ష నాయకుడు సభలో ప్రసంగించడం సంప్రదాయమని గుర్తు చేశారు. తాము చెప్పాలనుకునే అంశాలను లేవనెత్తేందుకు కూడా అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏడెనిమిది రోజుల నుంచి తనను మాట్లాడేందుకు అనుమతించడం లేదని వాపోయారు. ఇదో కొత్త ఎత్తుగడ అని.. ప్రతిపక్షానికి ఇక్కడ చోటు లేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.