భారత్-చైనా సరిహద్దు అంశమై కేంద్రంపై విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. భారత భూభాగాన్ని ఆక్రమించుకునేలా చైనాకు అవకాశమివ్వడం, దేశ వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహించడమేనని కేంద్రం నిజాన్ని దాస్తోందని ఆరోపించారు. ఈ మేరకు మోదీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ… తన మైక్రోబ్లాగింగ్ సైట్ లో మరో వీడియోను విడుదల చేశారు రాహుల్. సరిహద్దు ఉద్రిక్తతలపై రాహుల్ వీడియో విడుదల చేయడం ఇది నాలుగోసారి. అంతకుముందు జులై 17,20,23 తేదీల్లోనూ మోదీ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
చైనా.. భారత భూభాగాన్ని ఆక్రమించుకుంది. నిజాన్ని దాస్తూ.. జాతి ప్రయోజనాలకు విరుద్ధంగా వ్యవహరించింది. దీనిని ఇప్పుడు ప్రజల దృష్టికి తీసుకొచ్చి.. దేశభక్తిని చాటుకొనే ప్రయత్నం చేస్తోంది అని రాహుల్ అన్నారు. చైనా దళాలు చొచ్చుకురావడం తనకు తీవ్ర ఆవేదన కలిగించిందని అన్నారు రాహుల్. అసలు వేరే దేశ సైన్యం.. భారత్లోకి ఎలా ప్రవేశించగలదని ప్రశ్నించారు. ఇలాంటివి చూస్తుంటే తన రక్తం మరిగిపోతోందని పేర్కొన్నారు కాంగ్రెస్ నేత.