సహారా గ్రూప్ వ్యవస్థాపకుడు, ఛైర్మన్ సుబ్రతా రాయ్ మరణించారు. మంగళవారం రాత్రి గుండెపోటుతో ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని సహారా గ్రూప్ ధ్రువీకరిస్తూ ప్రకటన చేసింది. సుబ్రతా రాయ్ చాలా కాలంగా హై బీపీ, మధుమేహం, మెటా స్టాటిక్ కేన్సర్‌తో బాధపడుతున్నారు. వీటికి చికిత్స కూడా తీసుకుంటున్నారు. అయితే ఆదివారం రోజున ఆయన పరిస్థితి విషమించడం వల్ల ముంబయిలోని కోకిలా బెన్ ధీరూభాయ్ అంబానీ హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరారు. అక్కడే చికిత్స పొందుతూ ఆయన గుండెపోటు రావడంతో ఆదివారం మంగళవారం అర్ధరాత్రి సమయంలో మరణించారని కంపెనీ వెల్లడించింది. సుబ్రతా రాయ్ మృతితో సహారా ఇండియా పరివార్ శోకసముద్రంలో మునిగిపోయిందని తెలిపింది.
1948 జూన్10వ తేదీన బిహార్‌లోని అరారియాలో సుబ్రతా రాయ్ జన్మించారు. గోరఖ్‌పూర్‌లోని గవర్నమెంట్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్‌లో మెకానికల్ ఇంజనీరింగ్ చదివిన అనంతరం.. ఆయన ఆర్థిక ఒత్తిళ్లలో ఉన్న చిట్‌ఫండ్ కంపెనీ సహారా ఫైనాన్స్‌ను 1976లో కొనుగోలు చేశారు. 1978 కల్లా దానిని సహారా ఇండియా పరివార్‌గా తీర్చిదిద్ది.. ఆ తర్వాత ఆర్థిక, స్థిరాస్తి, మీడియా, ఆతిథ్య రంగాలకు తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించారు.