సుప్రీంకోర్టులో కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌కు తాత్కాలిక ఊరట లభించింది. అక్రమాస్తులకు సంబంధించిన కేసులో ఆయనపై చేపట్టిన దర్యాప్తుపై మధ్యంతర స్టే ఇస్తూ కర్ణాటక హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ విచారణను జులై 14కువాయిదా వేసింది.
డీకే శివకుమార్ తరఫున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ.. మే 23న దీనికి సంబంధించిన కేసు కర్ణాటక హైకోర్టు ధర్మాసనం ముందుకు రానుందని చెప్పారు. దీంతో సీబీఐ వేసిన పిటిషన్ విచారణను జులైకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది.
మనీలాండరింగ్ కేసులో విచారణ ఎదుర్కొంటోన్న డీకే శివకుమార్‌పై దర్యాప్తును ఆధారంగా చేసుకొని.. ఆదాయపు పన్ను శాఖ కూడా ఆయన ఇంటిపై గతంలో దాడులు చేసింది. అదే సమయంలో ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని సీబీఐ పలుమార్లు అనుమతి కోరింది. 2020లో డీకే శివకుమార్‌పై అవినీతి నిరోధక చట్టం కింద సీబీఐ కేసు నమోదు చేసింది.
తనపై జరుగుతోన్న దర్యాప్తును సవాలు చేస్తూ డీకే శివకుమార్ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. సీబీఐ దర్యాప్తుపై కర్ణాటక హైకోర్టు మధ్యంతర స్టే విధించి.. పలుమార్లు పొడిగించింది. దీంతో కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో సీబీఐ సవాలు చేసింది. ఈ క్రమంలోనే ఇవాళ సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది.