సిక్కిం రాష్ట్రంలో గతవారం వర్షాలు.. ఆకస్మిక వరదలు విలయం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ప్రకృతి విపత్తులో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు భారీ ఆస్తి నష్టం సంభవించినట్లు ఆ రాష్ట్ర అధికారులు తెలిపారు. అయితే ఈ ఆకస్మిక వరదల్లో మృతి చెందిన వారి సంఖ్య 34కు చేరినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. మరణించిన వారిలో పదిమంది సైనికులు ఉన్నట్లు పేర్కొన్నారు. ఇంకా 105 మంది ఆచూకీ దొరకలేదని చెప్పారు.
వాతావరణం సహకరించడంతో వరద ప్రభావిత ప్రాంతాల్లో భారత వాయుసేన సహాయక చర్యలు మొదలు పెట్టింది. అక్కడ చిక్కుకున్న యాత్రికులను ఎం-17, చినూక్ హెలికాఫ్టర్‌లలో దశల వారిగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తోంది. వాయుసేనకు చెందిన గరుడ కమాండోలు సహాయక చర్యల్లో నిమగ్నమవ్వగా.. సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తమాంగ్ సహాయక చర్యలపై సమీక్ష నిర్వహించారు.
ఆకస్మిక వరదల్లో 3 వేల432 పూరి గుడిసెలు, ఇళ్లు ధ్వంసమైనట్లు అధికారులు గుర్తించారు. 5 వేల 327 మందిని రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు తెలిపారు. వరదల కారణంగా నాలుగు జిల్లాలో మొత్తం 6,505 మంది నిరాశ్రయులైనట్లు వెల్లడించారు.