చట్టబద్ధమైన డిమాండ్‌ లేవనెత్తితే వేటు వేస్తున్నారు.. ఎంపీల సస్పెన్షన్‌పై సోనియా రియాక్షన్

-

కేంద్ర ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఊపిరి ఆడకుండా చేస్తోందని కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ ఛైర్‌పర్సన్‌ సోనియా గాంధీ అన్నారు. ఎన్నడూ లేని విధంగా పార్లమెంట్‌ నుంచి ఈ స్థాయిలో ప్రతిపక్ష సభ్యులను సస్పెండ్‌ చేస్తున్నారని మండిపడ్డారు. అది కూడా సహేతుకమైన, చట్టబద్ధమైన డిమాండ్‌ను లేవనెత్తినందుకు వేటు వేస్తున్నారని విమర్శించారు. పార్లమెంటులో సభ్యుల సస్పెన్షన్లను ఉద్దేశించి సోనియా ఈ వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ సెంట్రల్‌ హాల్‌లో జరిగిన కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో సోనియా గాంధీ ఎంపీల సస్పెన్షన్పై మాట్లాడారు.

పార్లమెంటులో సోమవారం రికార్డు స్థాయిలో 78 మంది లోక్‌సభ సభ్యులు సస్పెండ్‌ కాగా మంగళవారం మరో 49 మందిపై వేటు పడింది. గురువారం నుంచి ఇప్పటి వరకు మొత్తం 141 మంది సస్పెండైన సంగతి తెలిసింది.

డిసెంబర్ 13వ తేదీన పార్లమెంటులో జరిగిన అలజడి సంఘటన క్షమించరానిదని సోనియా గాంధీ అన్నారు. ఇలాంటి ఘటనలు ఎవరూ సమర్థించలేరని పేర్కొన్నారు. అయితే, దీనిపై స్పందించడానికి ప్రధానమంత్రి మోదీకి నాలుగు రోజుల సమయం పట్టిందని మండిపడ్డారు. అది కూడా తన అభిప్రాయాలను పార్లమెంటు వెలుపల వ్యక్తం చేయడం సభను అపహాస్యం చేయడమేనని విరుచుకుపడ్డారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version