ఇజ్రాయెల్ – హమాస్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో గాజాకు మానవతా సాయంపై ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉండటాన్ని కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించిందని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ తెలిపారు. ఓ ప్రముఖ వార్తా పత్రికకు రాసిన వ్యాసంలో కేంద్రం వైఖరిని ఆమె తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీ హమాస్ దాడులను తీవ్రంగా ఖండించిదని పేర్కొన్నారు.
ఇజ్రాయెల్ ప్రతీకార దాడులతో గాజాలోని అమాయక ప్రజలు నిస్సహాయులుగా మారిపోయారని సోనియా అన్నారు. ఇజ్రాయెల్‌తో శాంతియుతంగా కలిసుండేందుకు, పాలస్తీనా సార్వభౌమత్వం కోసం సుదీర్ఘ చర్చలకు మద్దతు ఇవ్వడమే కాంగ్రెస్ పార్టీ వైఖరిగా ఆమె పేర్కొన్నారు. ఇజ్రాయెల్ – పాలస్తీనాల మధ్య న్యాయం జరగకుండా శాంతి నెలకొనే అవకాశం లేదన్నారు. ఇజ్రాయెల్‌కు సంఘీభావం ప్రకటించే క్రమంలో పాలస్తీనా వాసుల హక్కుల గురించి ప్రధాని ప్రకటన చేయలేదని సోనియా తెలిపారు. హమాస్‌ను నాశనం చేసే క్రమంలో గాజాలోని సాధారణ ప్రజలను బాధ్యులను చేస్తూ వారిపై దాడులు చేయడం బాధాకరమని సోనియా వ్యాసంలో పేర్కొన్నారు.