జాతుల మధ్య వైరం మణిపుర్ రాష్ట్రాన్ని రావణకాష్టంలా మార్చింది. అల్లర్లు.. హత్యలు.. అత్యాచారాలతో ఆ రాష్ట్రం అట్టుడికిపోయింది. ఇప్పటికీ అక్కడి పరిస్థితులు ఇంకా అదుపులోకి రాలేదు. అయితే ఆ రాష్ట్రంలో అల్లర్ల వల్ల చోటుచేసుకున్న ఘర్షణల్లో ఇప్పటి వరకు ఎంత మంది ప్రాణాలు కోల్పోయారన్న సమాచారాన్ని తాజాగా ఆ రాష్ట్ర పోలీసు విభాగం వెల్లడించింది.
మణిపుర్ ఘర్షణల్లో ఇప్పటివరకు 175 మంది మృతి చెందారని మరో 33 మంది అదృశ్యమయ్యారని, 1,118 మంది గాయపడ్డారని ఆ రాష్ట్ర పోలీసు విభాగం తెలిపింది. చనిపోయిన 175 మందిలో 96 గుర్తుతెలియని మృతదేహాలు మార్చురీలోనే ఉన్నాయని పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం.. 5,172 నిప్పటించిన ఘటనలు చోటుచేసుకోగా… నిరసనకారులు 4,786 ఇళ్లు, 386 ప్రార్థనా మందిరాలకు నిప్పు అంటించారు. రాష్ట్ర ఆయుధగారం నుంచి 5,668 ఆయుధాలను లూటీ చేశారు.
అసలేం జరిగిందంటే.. మే 3వ తేదీన తమను ఎస్టీల్లో చేర్చాలన్న మైతేయ్‌ల డిమాండ్‌కు వ్యతిరేకంగా కుకీలు ఆందోళన చేపట్టడంతో హింసాకాండ షురూ అయింది. చిన్నచిన్న ఆందోళనలతో మొదలైన గొడవ హత్యలు, అత్యాచారాలు చేసే వరకూ దారితీసింది. కొన్నినెలలపాటు ఈ హింసాత్మక ఘర్షణలు కొనసాగాయి. సాధారణ పరిస్థితులు నెలకొల్పేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తోన్న ప్రయత్నాలతో ప్రస్తుతం ఘర్షణలు కాస్త తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తోంది.