నేర విచారణ నుంచి గవర్నర్లకు రక్షణ.. నిబంధనపై సుప్రీం కీలక నిర్ణయం

-

పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌పై ఇటీవల ఓ మహిళ లైంగిక వేధింపుల ఆరోపణలు చేయడం తీవ్ర కలకలం రేపిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ఈ నేపథ్యంలో నేర విచారణ నుంచి గవర్నర్లకు రక్షణపై అత్యున్నత న్యాయస్థానం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. నేర విచారణ నుంచి గవర్నర్‌కు మినహాయింపు కల్పించే ఆర్టికల్‌ 361 రాజ్యాంగ నిబంధనను పరిశీలించేందుకు అంగీకారం తెలిపింది.

బెంగాల్‌ గవర్నర్‌ సీవీ ఆనంద బోస్‌ తనను లైంగిక వేధింపులకు గురి చేశారంటూ అక్కడి రాజ్‌భవన్‌లో తాత్కాలిక సిబ్బందిగా పని చేస్తున్న ఓ మహిళ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన బాధిత మహిళ.. గవర్నర్లకు రక్షణ కల్పించే రాజ్యాంగంలోని 361వ అధికరణపై న్యాయ సమీక్ష చేయాలని అభ్యర్థించారు. నేర విచారణ నుంచి మినహాయింపు ఇచ్చే విషయంలో నిర్దిష్ట మార్గదర్శకాలను రూపొందించేలా ఆదేశాలు జారీ చేయాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఇందుకు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించింది.. దీనిపై తమ స్పందన తెలియజేయాలంటూ పశ్చిమబెంగాల్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version