పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం : సుప్రీంకోర్టు

-

చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. అంతేగాక ఇది అతిపెద్ద నేరమని స్పష్టం చేసింది. పిల్లల అశ్లీల వీడియోలు డౌన్లోడ్‌ చేసుకొని చూడటాన్ని పోక్సో, ఐటీ చట్టాల కింద నేరంగా పరిగణించలేమని మద్రాసు హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీలును సుప్రీంకోర్టు విచారించింది.

బాలల సంక్షేమం కోసం కృషి చేస్తున్న ఫరీదాబాద్‌కు చెందిన ‘జస్ట్‌ రైట్స్‌ ఫర్‌ చిల్డ్రన్‌ అలయెన్స్‌’, దిల్లీకి చెందిన ‘బచ్‌పన్‌ బచావో ఆందోళన్‌’ ఎన్జీవోలు ఈ అప్పీలును దాఖలు చేయగా.. జనవరి 11న తీర్పు చెప్పిన మద్రాసు హైకోర్టు.. తన మొబైల్‌ ఫోనులో చిన్నపిల్లల అశ్లీల వీడియోలను డౌన్‌లోడు చేసుకున్న 28 ఏళ్ల యువకుడికి వ్యతిరేకంగా క్రిమినల్‌ చర్యలు తీసుకోకుండా రద్దు చేసింది.

 

మద్రాసు హైకోర్టు నిర్దోషిగా ప్రకటించిన నిందితుడి తరఫున హాజరైన న్యాయవాది.. ఆ వీడియోలు తన క్లయింటు వాట్సాప్‌కు ఆటోమేటిక్‌గా డౌన్‌లోడ్‌ అయినట్లు సుప్రీంకోర్టుకు నివేదించారు. అప్పీలును విచారించిన సుప్రీంకోర్టు తీర్పును రిజర్వులో ఉంచి.. ఎవరికైనా అటువంటి వీడియోలు ఇన్‌బాక్సులో వచ్చి చేరితే సంబంధిత చట్టాల కింద పరిశీలనను నివారించడానికి వాటిని డిలీట్‌ చేయాలని సూచించింది. అలా చేయకుండా ఐటీ నిబంధనలను ఉల్లంఘిస్తే అప్పుడు అది నేరమవుతుందని స్పష్టం చేసింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version