దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కేసును సుమోటోగా స్వీకరించిన సర్వోన్నత న్యాయస్థానం ఇవాళ విచారణ చేపట్టింది. అంత ఘోరం జరిగితే.. ఆత్మహత్య అని ఎలా చెప్పారంటూ ఆర్‌జీ కార్ మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ తీరుపై మండిపడింది. బాధితురాలి ఫొటో, పేరును ప్రచురించిన మీడియా సంస్థలపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ ఘటనలో నేరాన్ని ఉదయాన్నే గుర్తించారు కానీ మెడికల్ ప్రిన్సిపల్ మాత్రం దీన్ని ఆత్మహత్య కేసుగా సమాచారం అందించే ప్రయత్నం చేశారని సుప్రీంకోర్టు ఫైర్ అయింది. అతడి ప్రవర్తనపై అనుమానాలు ఉన్నప్పుడు.. వెంటనే మరో కాలేజీకి ఎలా నియమించారు? అని ప్రశ్నించింది. మృతదేహాన్ని అంత్యక్రియలకు అప్పగించిన మూడు గంటల తర్వాత రాత్రి 11.45 గంటలకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయాల్సి వచ్చింది? అంత ఆలస్యం ఎందుకైందని? ఆసుపత్రి అధికారులు, కోల్‌కతా పోలీసులు అప్పటిదాకా ఏం చేస్తున్నారు? అని నిలదీసింది. మహిళలు ఉద్యోగాలకు వెళ్లే పరిస్థితి లేకపోతే.. పనిచేసే ప్రదేశంలో భద్రత లేకపోతే వారికి మనం సమానత్వాన్ని నిరాకరిస్తున్నట్లేనని సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది.