స్వలింగ సంపర్కుల వివాహాలకు చట్టబద్ధత కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు ఇవాళ కీలక తీర్పును వెలువరించనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై చంద్రచూడ్ నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏప్రిల్ 18వ తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ అంశంపై ఇరుపక్షాల వాదనలు విన్న విషయం తెలిసిందే. అనంతరం మే 11వ తేదీన తీర్పును రిజర్వ్ చేసింది. స్వలింగ పెళ్లిళ్లకు గుర్తింపును ఇచ్చేలా సమాజాన్ని ఒప్పించడానికి రాజ్యాంగ అధికరణం 142 ద్వారా సంక్రమించిన అపరిమిత అధికారాలను సుప్రీంకోర్టు ఉపయోగించాలని పిటిషనర్ల తరఫు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గీ విజ్ఞప్తి చేశారు.
మరోవైపు కేంద్రం పిటిషనర్ల వాదనను తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి వివాహాలకు చట్టబద్ధత కల్పిస్తే వ్యక్తిగత చట్టాలు, సామాజిక విలువల సమతుల్యత పూర్తిగా దెబ్బతింటుందని పేర్కొంది. వివాహాలను గుర్తించడం పూర్తిగా చట్టపరమైన అంశమని, దీనికి కోర్టులు దూరంగా ఉండాలని కోరింది. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, అసోం సహా ఏడు రాష్ట్రాలు కూడా స్వలింగ వివాహాల చట్టబద్ధతపై పిటిషనర్ల వాదనను వ్యతిరేకిస్తూ తమకు తెలియజేశాయని తెలిపింది. ఈ నేపథ్యంలో ఈ అంశంపై సుప్రీం తీర్పు ఎలా ఉంటుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.