తమిళనాడును వర్షాలు ముంచెత్తుతున్నాయి. వరద గుప్పిట్లో తమిళ ప్రజలు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు. భారీ వరదలతో రాష్ట్రంలోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. జలదిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలను సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తీసుకువస్తున్నాయి. ఇంకా చాలా ప్రాంతాల వాసులు వరద గుప్పిట్లోనే ఉన్నారు. భారీ వరదలతో తమిళ ప్రజల జీవనం అస్తవ్యస్తమైంది. వరదలో చిక్కుకున్న వారికోసం ఎన్డీఆర్ఎఫ్, కోస్ట్గార్డ్ సిబ్బంది సహాయక చర్యలను ముమ్మరం చేశారు. హెలికాఫ్టర్ల ద్వారా బాధితులకు ఆహారం అందిస్తున్నారు.
తమిళనాడు పశుసంవర్థకశాఖ మంత్రి అనితా రాధాకృష్ణన్, ఆయన సిబ్బంది వరదనీటిలో చిక్కుకున్నారు. ఆయన స్వగ్రామమైన తాండుపట్టుకు వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆయన ఫోన్ ద్వారా సమాచారాన్ని బంధువులకు తెలియజేయగా వారు అధికారులకు చెప్పారు. వెంటనే అధికారులు సహాయక సిబ్బందిని అలర్ట్ చేయగా.. తిరునల్వేలి డీసీపీ, అగ్నిమాపక శాఖ సిబ్బంది మంత్రిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. ఇక వరదల నేపథ్యంలో పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, వరద తగ్గే వరకు ఎవరూ బయటకు రావొద్దని ప్రభుత్వం సూచించింది.