ఐఐటీ విద్యాలయాల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు అడ్డుకట్ట పడటం లేదు. ఇప్పటికే పలు ఐఐటీల్లో ఒత్తిడి తట్టుకోలేక కొందరు.. డిప్రెషన్‌తో మరికొందరు.. వేధింపులతో ఇంకొందరు తమ ప్రాణాలు బలితీసుకున్నారు. ఇప్పుడు తాజాగా మరో విద్యార్థి బలవన్మరణానికి పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటన ఐఐటీ ఖరగ్‌పూర్‌లో జరిగింది. ఇంతకీ ఏం జరిగిందంటే..?
ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెదక్ జిల్లా తూప్రాన్‌కి చెందిన ఓ విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లాలోని చెట్ల తిమ్మయ్య పల్లికి చెందిన కిరణ్.. ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విభాగంలో నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. కిరణ్.. మంగళవారం రోజున తన హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ వార్డెన్‌కు చెప్పగా వారు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కిరణ్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రాజెక్ట్ వర్క్‌లో వెనుకబడడంతోనే కిరణ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. . మృతదేహాన్ని ఖరగ్పూర్ నుంచి విమానంలో స్వస్థలికి తరలిస్తున్నారు. చేతికందిన కుమారుడు మృతి చెందడంతో కిరణ్ తల్లదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. గత ఏడాదిన్నర కాలంలో ఐఐటీ ఖరగ్‌పూర్‌లోని ముగ్గురు విద్యార్థులు అనుమానాస్పద రీతిలో మృతి చెందారు.