భారత్ లో మరోసారి ఉగ్రచర్యలు షురూ అయ్యాయి. జమ్ముకశ్మీర్‌లో జరిగే జీ-20 సదస్సును భగ్నం చేయడమే లక్ష్యంగా ఉగ్రవాద చర్యలు పెరిగాయి. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. శ్రీనగర్‌లో పెద్ద ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు. నేషనల్ సెక్యూరిటీ గార్డ్- NSGతో మూడు అంచెల భద్రతను ఏర్పాటు చేశారు. మెరైన్ కమెండోలు ఎక్కడికక్కడ గస్తీ కాస్తున్నారు. లాల్ చౌక్ క్లాక్ టవర్ వద్ద భద్రతా ఏర్పాట్లను కమెండోలు పరిశీలించారు.
జీ-20 సమావేశానికి సంబంధించి కొన్నిఅనుమానాస్పద టెలికమ్యూనికేషన్‌ల నుంచి బెదిరింపులు రావడం వల్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని బలగాలు హెచ్చరికలు జారీ చేశాయి. జీ-20 సదస్సు లక్ష్యంగా కశ్మీర్‌లో అల్లర్లు సృష్టించేందుకు ఉగ్రవాదులు చేసిన చొరబాటు ప్రయత్నాలను ఇటీవల భద్రతా బలగాలు సమర్థవంతంగా అడ్డుకున్నాయి.
ఉగ్రవాదులకు సహాయం చేసేందుకు పాకిస్థాన్ సైన్యం పంపిన డ్రోన్‌ను కూల్చి వేసేందుకు భారత్ సైన్యం కాల్పులు జరపగా ఆ డ్రోన్ తిరిగి వెళ్లింది. ఉగ్రవాదుల చర్యలు పెరిగిన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బలగాలు తీవ్రంగా గస్తీ కాస్తున్నాయి. శ్రీనగర్‌లో జీ-20 సదస్సులు నిర్వహించొద్దంటూ జైషే మహమ్మద్ ముసుగు సంస్థ.. పీపుల్స్ యాంటీ ఫాసిస్టు ఫోర్స్ -PAFF గతేడాదే భారత్‌ను హెచ్చరించింది.