దేశం బలంగా ఉంటేనే ప్రపంచం మాట వింటుంది : ప్రధాని మోడీ

-

ఎంతటి క్లిష్ట సమస్యనైనా పరిష్కరించగల శక్తి తనకుందంటూ భారత్ ప్రపంచానికి నిరూపిస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఉత్తరప్రదేశ్  లోని పీలీఖీల్లో బీజేపీ మంగళవారం నిర్వహించిన బహిరంగ సభలో మోడీ పాల్గొని మాట్లాడారు.

“ప్రస్తుతం ప్రపంచమంతా అనేక కష్టాలను ఎదుర్కొంటోంది. సమస్య ఎంత క్లిష్టమైనా సరే.. భారత్ తలచుకుంటే కచ్చితంగా పరిష్కరించగలదు. ప్రతీఒక్కరి ఓటు బలంతోనే అది సాధ్యమవుతుంది. భారత్ స్పూర్తి, శక్తితో అభివృద్ధి చెందిన దేశంగా అవతరించేందుకు మనమంతా కృషి చేస్తున్నాం. అనుకుంటే సాధించలేనిదంటూ ఏదీ లేదని భారత్ ప్రపంచానికి నిరూపిస్తోంది. దేశం బలంగా ఉన్నప్పుడే ప్రపంచం దాని మాట వింటుంది” అని మోడీ పేర్కొన్నారు.

కాంగ్రెస్ హయాంలో ఆ పార్టీ ప్రపంచ దేశాల నుంచి ఎన్నోసార్లు సాయం కోరిందని విమర్శించారు. కొవిడ్ మహమ్మారి సమయంలో ప్రపంచానికే ఔషధ సాయం చేసే స్థాయికి భారత్ ఎదిగిందని సగర్వంగా చాటి చెప్పారు. “మన దేశం అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక శక్తిగా అవతరించినప్పుడు మీరు గర్వించారా లేదా? చంద్రయాన్ ద్వారా చంద్రునిపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినప్పుడు గర్వించారా లేదా? జీ20 శిఖరాగ్ర సదస్సుకు సమర్ధవంతంగా బాధ్యత వహించిన భారత్ తీరుపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి” అని వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version