తమిళ స్టార్ హీరో విజయ్ తమిళ వెట్రి కళగం పేరిట రాజకీయ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ విల్లుపురం జిల్లా విక్రవండి వద్ద టీవీకే భారీ రాజకీయ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ తన తొలి రాజకీయ ప్రసంగం చేశారు. బీజేపీతో తాము సిద్ధాంతపరంగా విభేదిస్తామని.. డీఎంకేని రాజకీయంగా వ్యతిరేకిస్తామని తమ వైఖరిని స్పష్టం చేశారు.
సమాజంలో చీలికలు తీసుకొచ్చేందుకు ఓ గ్రూపు ప్రయత్నిస్తోందని.. సమాజాన్ని విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నించే వాళ్లు తమకు మొదటి శత్రువులు అని పేర్కొన్నారు. సర్దుబాటు రాజకీయాలకు, రాజీ ధోరణులకు తాము పూర్తి వ్యతిరేకమని స్పష్టం చేశారు. తాను వ్యక్తి గత ప్రయోజనాల కోసం రాజకీయాల్లోకి రాలేదని.. సామాజిక నిబద్థతో రాజకీయాల్లో అడుగుపెట్టానని తన గొంతు వినిపించారు. రాజకీయాలకు కొత్త వాడిని కావచ్చు.. కానీ నా చిత్తశుద్దిని ఎవ్వరూ శంకించలేరని స్పష్టం చేశారు విజయ్ దళపతి. తమ పార్టీకి ప్రధాన శత్రువులు అవినీతి, మతోన్మాదం అని వెల్లడించారు.