బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై కత్తి దాడి ఘటనతో ముంబై మరోసారి ఉలిక్కిపడింది. సల్మాన్ ఖాన్ ఇంటి ముందు కాల్పులు, రాజకీయ నేత బాబా సిద్ధిఖి హత్య వంటి వరుస ఘటనలు జరుగుతూ ఉండడంతో ముంబై సేఫ్ కాదంటూ పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు మహారాష్ట్రలో శాంతిభద్రతలు క్షీణిస్తున్నాయని, వరుసగా ప్రముఖులపై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం చోద్యం చూస్తుందని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం ఎమర్జెన్సీ సినిమా ప్రత్యేక ప్రదర్శనకు హాజరైన సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, ఆ మూవీ నటి కంగనా రనౌత్ తో కలిసి మీడియా ముందుకి వచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఒకటి, రెండు సంఘటనలను చూపుతూ ముంబై ప్రతిష్టను దిగజార్చే ప్రయత్నం చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. దేశంలో ఉన్న మెగా సిటీల్లో ముంబై అత్యంత సురక్షితమైన నగరం అని అన్నారు ఫడ్నవిస్. ముంబై ప్రతిష్టను మరింత సురక్షితంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చూస్తామన్నారు.