సైఫ్ అలీఖాన్ పై దాడి ఘటన.. పోలీసుల విచారణలో కీలక విషయాలు

-

ఈరోజు తెల్లవారుజామున బాలీవుడ్ అగ్ర నటుడు సైఫ్ అలీ ఖాన్ పై ఆయన ఇంట్లో జరిగిన దాడి ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ అగంతకుడు సైఫ్ ని కత్తితో పొడిచి చంపేందుకు ప్రయత్నించాడు. ఈ దాడి నుంచి తప్పించుకొని సైఫ్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం సైఫ్ అలీ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు.

తాజాగా సైఫ్ దాడి కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఈ దాడి ఘటనను ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ప్రతిష్టాత్మకంగా తీసుకొని దర్యాప్తు చేపట్టారు. సిసి ఫుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడి కోసం పోలీసులు విపరీతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే సైఫ్ నివాసంలో పనిమనిషితో దుండగుడు మొదట గొడవ పడినట్లు సమాచారం. పనిమనిషిపై దాడిని అడ్డుకునేందుకు సైఫ్ ప్రయత్నించగా.. దుండగుడు కత్తితో విరుచుకుపడ్డట్లు తెలుస్తోంది.

పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఆ దుండగుడు దొంగతనం కోసమే అతని ఇంట్లోకి వెళ్లారు. అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు తప్పించుకునే మార్గం ద్వారా దుండగుడు సైఫ్ నివాసంలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే నిందితుడు దాడి చేసే ముందు సైఫ్ ని కోటి రూపాయలు డిమాండ్ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. ఇందుకు ఒప్పుకోకపోవడంతో దుండగుడు దాడి చేసినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే బయటకు వచ్చే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version