కర్ణాటకలోని చిక్కమంగళూరులో జరిగిన గణేశ్ నిమజ్జన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. వినాయకుడిని నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా.. విద్యుత్ తీగలు తగిలి ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
బి. హోసల్లి గ్రామంలో వినాయక నిమజ్జనం చేసి తిరిగి ట్రాక్టర్ లో వస్తున్నారు. ఈ క్రమంలో ట్రాక్టర్ లోని మండపానికి విద్యుత్ తీగలు తగిలి అందులోని వారంతా విద్యుదాఘాతానికి గురయ్యారు. బాధితులను ఆస్పత్రికి తరలించగా అందులో ముగ్గురు చికిత్స పొందుతూ మరణించారు.
మృతులను రాజు(47), రచన(35), పార్వతిగా (26) గుర్తించారు. విద్యుత్ తీగలు మరీ కిందకు ఉండటం వల్లే ప్రమాదం జరిగిందని.. విద్యుత్‌శాఖ అధికారులను పరిహారం చెల్లించాలని గ్రామస్థులు డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్లో ఆరుగురు ప్రయాణిస్తున్నట్లు తెలిపారు. ఈ ఘటన గురించి సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.