బంగాల్లో భాజపా, టీఎంసీ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇరుపార్టీల నేతలు, కార్యకర్తలు పలుమార్లు బాహాబాహీకి దిగిన సందర్భాలు చాలా ఉన్నాయి. శుక్రవారం చిసురాలో అలాంటి ఘటనే జరిగింది.
ర్యాలీగా వెళ్తున్న భాజపా కార్యకర్తలపై దాడికి దిగారు టీఎంసీ ఎమ్మెల్యే అసిత్ మజుందార్. పార్టీ కార్యకర్తలతో కలిసి కర్రలతో భాజపా కార్యకర్తలను కొట్టారు. ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం వల్ల ఎమ్మెల్యే తీరును పలువురు నెటిజన్లు విమర్శిస్తున్నారు. కాసేపటికే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. పలువురు భాజపా కార్యకర్తలను అరెస్టు చేశారు.
“శాంతియుతంగా చేస్తున్న ర్యాలీ భాజపా శ్రేణులపై ఎమ్మెల్యే అసిత్ మజుందార్, టీఎంసీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారు. ఎమ్మెల్యే మజుందార్ ఆదేశాలతో ఉద్దేశపూర్వకంగానే ఈ దాడి జరిగింది. ఎమ్మెల్యే స్వయంగా పలువురు భాజపా కార్యకర్తల్ని కర్రలతో కొట్టడం దారుణం.” – తుషార్ మజుందార్, హుగ్లీ జిల్లా భాజపా అధ్యక్షుడు
మరోవైపు, భాజపా కార్యకర్తలే తన కారును ఆపి దాడి చేసేందుకు ప్రయత్నించారని ఎమ్మెల్యే అసిత్ మజుందార్ ఆరోపించారు. అనంతరం తనను చంపేందుకు ప్రయత్నించారని చెప్పుకొచ్చారు. మమత బెనర్జీ, అభిషేక్ బెనర్జీ.. దొంగలు అంటూ భాజపా కార్యకర్తలు నినాదాలు చేస్తున్నారని మజుందార్ మండిపడ్డారు.