సీఎం రేవంత్ విసిరిన సవాల్‌ను విజయవంతంగా పూర్తి చేసిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆదివారం ఉదయం మీడియాతో సంభాషించారు. ‘మూసీ ప్రక్షాళన చేయండి..పేదల ఇళ్లను కూల్చకండి’ అనే డిమాండ్‌తో బీజేపీ నేతలు మూసీ పరీవాహక ప్రాంతాల్లో బస్తీ నిద్ర చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డీపీఆర్, నిధులు లేకుండా మూసీ పునరుజ్జీవం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. పేదవాళ్ల మీద నుంచి బుల్డోజర్లు ఎక్కిస్తారా..? వేల ఇళ్లు, ఆలయాలు, ప్రార్థనా మందిరాలను కూల్చుతారా? అని ప్రశ్నించారు.
బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై మూసీ ప్రక్షళనను అడ్డుకుంటున్నాయంటూ అధికార కాంగ్రెస్ చేసిన ఆరోపణలపై ఆయన తీవ్రంగా స్పందించారు. ప్రత్యక్ష రాజకీయాల్లో తాము బీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోలేదన్నారు. ఇక ముందు కూడా అది జరగబోదన్నారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పొత్తు పెట్టుకున్న విషయాన్నిఈ సందర్భంగా గుర్తుచేశారు. తన డీఎన్ఏ ఏమిటో ప్రజలకు తెలుసని.. బీఆర్ఎస్, కాంగ్రెస్ డీఎన్ఏ ఒక్కటేనని కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు.