పుల్వామా ఘటనకు రెండేళ్లు.. అమరవీరులకు నివాళి

-

న్యూఢిల్లీ: పుల్వామా ఉగ్రదాడిని దేశం మరోసారి గుర్తు చేసుకుంది. దేశ రక్షణ, భద్రతలో తమ ప్రాణాలను అర్పించిన వీర జవాన్లకు దేశం మొత్తం నివాళులర్పిస్తోంది. రెండేళ్ల కిందట జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామాలో సైనిక వాహన శ్రేణిపై పాకిస్థాన్‌కు చెందిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు ఆత్మహుతి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్‌కు (సీఆర్‌పీఎఫ్) చెందిన 40 మంది ప్రాణాలు కోల్పోయారు. 2019 ఫిబ్రవరి 14వ తేదీన జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిపై లేథిపురలో ఈ ఘటన చోటు చేసుకుంది. పుల్వామా ఘటనతో ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్, భారత సైనికులు అమర సైనికులకు నివాళులర్పించారు.

Pulwama

78 సైనిక వాహనాల్లో 2500 మంది సైనికులు జమ్మూ నుంచి శ్రీనగర్‌కు వెళ్తుండగా.. సాయంత్రం 4 గంటల సమయంలో ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ దార్ ఆత్మాహుతికి పాల్పడ్డాడు. ఈ దాడిలో 40 మంది ప్రాణాలు కోల్పోయారు. పుల్వామా దాడి తర్వాత భారత్, పాకిస్థాన్‌కు మధ్య ఉద్రిక్తత తారాస్థాయికి చేరుకుంది. మోస్ట్ ఫేవర్డ్ నేషన్ (ఎంఎఫ్‌ఎన్)గా ఉన్న పాకిస్థాన్ నుంచి హోదాను భారత్ ఉపసంహరించుకుంది. ఈ దాడికి తామే బాధ్యులమని జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ ప్రకటించింది. పాకిస్థాన్‌కు గుణపాఠం చెప్పేందుకు భారత్ మరోసారి సర్జికల్ స్ట్రయిక్ నిర్వహించింది. ఫిబ్రవరి 26వ తేదీన తెల్లవారుజామున పాక్ భూభాగంలోకి చొరబడి బాలాకోట్‌లోని జైషే మహమ్మద్ ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన విరుచుకుపడింది. ఈ సర్జికల్ స్ట్రెయిక్‌లో దాదాపు 300 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

Pulwama

ఈ దాడిలో వింగ్ కమాండర్ అభినందన్ పాక్‌కు చిక్కిన విషయం తెలిసిందే. అప్పుడు భారత్ అనేక దౌత్య చర్చలు నిర్వహించిన తర్వాత పాక్ కమాండర్ అభినందన్‌ను విడిచిపెట్టింది. అయితే పుల్వామా దాడి పూర్తి బాధ్యత తమదేనని ఆ దేశ సీనియర్ మంత్రి ఫవాద్ చౌదరి తెలిపారు. గతేడాది అక్టోబర్‌లో ‘భారత్‌లోకి చొరబడి భారత సైనికులను 40 మందిని హతమార్చాం’ అని ఆయన ప్రకటించారు. ఈ ఘనత దేశ ప్రధాని ఇమ్రాన్‌కే దక్కుతుందన్నారు. కానీ అక్కడి పార్లమెంట్‌లో తీవ్ర అభ్యంతరాలు, వ్యతిరేకాలు రావడంతో.. అప్పటి నుంచి తమను ఎలాంటి సంబంధం లేదని పాకిస్థాన్ ప్రభుత్వం చెబుతూ వస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version